Srisailam: కృష్ణమ్మకు భారీ వరద... శ్రీశైలం డ్యామ్ గేట్ల ఎత్తివేత!

  • తూర్పు కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలు
  • శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద
  • నేడు మరోసారి తెరచుకోనున్న సాగర్ గేట్లు
  • ప్రకాశం బ్యారేజ్ దిగువన అప్రమత్తమైన అధికారులు

తూర్పు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోయి ఉండటంతో, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు మరింతగా పెరుగగా, జలాశయం ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ సంవత్సరం కేవలం మూడు నెలల వ్యవధిలో ఏడవ సారి శ్రీశైలం జలాశయం గేట్లను తెరవాల్సి వచ్చింది. గత 30 సంవత్సరాల్లో ఇలా ఎన్నడూ జరుగలేదు.

మంగళవారం రాత్రి నాలుగు గేట్లను తెరచిన అధికారులు, తెల్లవారుజామున వస్తున్న వరదను అంచనా వేసి, ఆపై మరో మూడు గేట్లను ఈ ఉదయం తెరిచారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 4.48 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, స్పిల్ వే ద్వారా 1.95 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. మిగతా నీటిలో 68 వేల క్యూసెక్కులను కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి అనుబంధంగా ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలు, కాలువల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు. గరిష్ఠంగా 885 అడుగుల నీటిమట్టం ఉండే జలాశయంలో ప్రస్తుతం 884.80 అడుగుల మేరకు నీరుంది.

మరోవైపు నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతున్న వరద నీటి పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఈ మధ్యాహ్నంలోగా గేట్లను తెరిచే అవకాశాలు ఉన్నాయి. సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయం, పూర్తిస్థాయి నీటితో ఉన్న నేపథ్యంలో, వచ్చిన నీరు వచ్చినట్టే ప్రకాశం బ్యారేజ్ కు చేరుకోనుంది. దీంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల వరద గురువారం నాటికి ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వెళుతుందని, లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News