Bhuma Akhilapriya: బెయిల్ వచ్చిన తర్వాత కూడా నా సోదరి ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?: భూమా అఖిలప్రియ
- కర్నూలు జిల్లా ఎస్పీ మమ్మల్ని టార్గెట్ చేశారు
- యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే అక్రమ కేసులు పెట్టారు
- వారం రోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం
కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్పపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి, హింసిస్తున్నారని చెప్పారు. యురేనియంతో జరిగే నష్టాలను తెలుసుకోవడానికి కడప జిల్లా పులివెందులకు వెళ్లి వచ్చిన రెండు రోజులకే తన భర్త భార్గవరామ్ పై కేసులు పెట్టారని తెలిపారు.
ఎలాంటి వారెంట్ లేకుండానే హైదరాబాదులోని తమ నివాసంలో సోదాలను నిర్వహించారని అఖిలప్రియ మండిపడ్డారు. సోదాల సమయంలో సీఐలు, ఎస్సైలు మాట్లాడిన విషయాలను రికార్డు చేశామని... జిల్లా ఎస్పీ ఒత్తిడితోనే తాము వచ్చామని వారు చెప్పారని... ఈ ఆధారాలతో వారం రోజుల్లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఇక బెయిల్ వచ్చిన తర్వాత కూడా తన భర్త గురించి బెంగళూరులోని తన సోదరి నివాసంలో సోదాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. తమ ఇంట్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని... వారిని తానే పోలీసులకు అప్పగించానని తెలిపారు. తన కుటుంబసభ్యులకు ఏదైనా జరిగితే జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.