East Godavari District: కనపడని రమ్య జాడ.. కచ్చులూరు వద్ద విషాదంలో కుటుంబీకులు!
- 38 రోజులైనా దొరకని యువ ఇంజనీర్ మృతదేహం
- బోటు వెలికితీశారని తెలియగానే వచ్చిన కుటుంబం
- కన్నీటితో గోదావరి ఒడ్డున ఎదురుచూపు
ఆ కుటుంబానికి ఎదురైన విషాదాన్ని వర్ణించడానికి మాటలు కూడా చాలవు. మనిషి పోయిన బాధ కంటే ఆ మనిషి చివరి చూపు కూడా దక్కలేదన్న ఆవేదన జీవితాంతం వెన్నంటి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద నీట మునిగిన ‘రాయల్ వశిష్ట’లో ప్రయాణిస్తూ గల్లంతైన కారుకూరి రమ్య కుటుంబ సభ్యుల వేదన ఇటువంటిదే.
ఆ దుర్ఘటన జరిగి 38 రోజులైనా కుమార్తె ఆచూకీ కూడా లభించకపోవడం ఆ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. బోటు వెలికి తీశారని తెలియగానే ఏదో తెలియని ఆశతో పది మంది కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాల్లో రమ్య ఉందో లేదో తెలియక అల్లాడిపోతున్నారు.
మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (22) దుర్ఘటనకు ముందే తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించింది. ఆమె తండ్రి సుదర్శన్ విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ కావడంతో తన శాఖలోనే కుమార్తె ఉద్యోగం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. తొలి వేతనం తీసుకున్నాక వినాయక ఉత్సవాల్లో పాల్గొని నిమజ్జనం రోజు సందడి చేసింది.
స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తున్నానని, లాంచి ఎక్కి గోదావరిలో ప్రయాణిస్తూ పాపికొండల అందాలు వీక్షించనున్నానని చెబితే ఆనందంగా పంపించారు. కానీ అదే తమకు ఆఖరి చూపు అవుతుందని కలలో కూడా ఊహించలేకపోయారు. బోటు ప్రమాదంలో కూతురు గల్లంతు కావడం, కనీసం మృతదేహం కూడా లభించక పోవడంతో కన్నీటితో ఎదురుచూస్తున్నారు.
నిన్నబోటులో ఎనిమిది మృతదేహాలు బయటపడినా అందులో రమ్య ఉన్నదీ లేనిదీ తేలలేదు. రమ్య ఆచూకీ దొరుకుతుందన్న ఆశతో తల్లిదండ్రులు సుదర్శన్, భూమక్క, తమ్ముడు రఘుతో కలిసి మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. రమ్య అచూకీ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.