Anand Mahindra: తల్లిని పాత స్కూటర్ పై తీర్థయాత్రకు తిప్పుతున్న తనయుడు.. అతనికి కారు కానుకగా ఇస్తానన్న ఆనంద్ మహీంద్రా
- ఇప్పటివరకు 48,100 కిలో మీటర్ల ప్రయాణం
- ట్విటర్ ద్వారా తెలిపిన నాందీ ఫౌండేషన్ ఛైర్మన్ మనోజ్
- తల్లిపై చూపుతున్న ప్రేమకు ఆనంద్ మహీంద్రా ఫిదా
సాధారణంగా తీర్థయాత్రల కోసం బస్సులోనో, కారులోనో వెళతాం. అయితే, తీర్థయాత్రలు చేయాలని కోరిక ఉన్నప్పటికీ డబ్బు లేకపోవడంతో చాలా మంది ఆ కోరికను నెరవేర్చుకోలేకపోతారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ వృద్ధురాలిదీ ఇదే పరిస్థితి. అమె భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తన కుమారుడి వద్ద డబ్బు అడగలేని పరిస్థితి.
చివరకు ఆ కుమారుడే తల్లి కోరికను నెరవేర్చాలన్న తపనతో తన వద్ద ఉన్న పాత స్కూటర్ పై ఆమెను తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు తీర్థయాత్రల కోసం తన తల్లిని 48,100 కిలో మీటర్లు తిప్పాడు.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.కృష్ణకుమార్ (39) అనే వ్యక్తి కథ ఇది. 70 ఏళ్ల తన తల్లితో కలిసి ఆయన చేస్తున్న ఈ తీర్థయాత్రను నాందీ ఫౌండేషన్ ఛైర్మన్ మనోజ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. హంపీని చూడాలని ఉందంటూ ఓ సారి తన తల్లి చూదరత్నా తన కోరికను బయటపెట్టింది. దీంతో ఆమె కోరిక నెరవేర్చడానికి కృష్ణ కుమార్ తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 20 ఏళ్ల క్రితం కొన్న బజాజ్ చేతక్ స్కూటర్ పై ఆమెను కూర్చోబెట్టుకుని బయలుదేరారు.
దేశంలోని పలు పుణ్యక్షేత్రాలకు తన తల్లిని తీసుకెళ్లాడు కృష్ణకుమార్. ఇందుకోసం ఏడు నెలలుగా వీరు స్కూటర్ పైనే ప్రయాణం చేస్తున్నట్లు తెలిసింది. తమకు కావాల్సిన వస్తువులను, దుస్తులను స్కూటర్ లో పెట్టుకున్నారు. హోటళ్లలో ఉండేందుకు డబ్బు లేకపోవడంతో అప్పుడప్పుడు మఠాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తన తల్లి ఎన్నడూ తమ నగరాన్ని వదలి ఇతర ప్రాంతానికి వెళ్లలేదని చెప్పాడు. తన తండ్రి మృతి చెందడానికి ముందు తన తల్లి వంటింటికే పరిమితమై ఉండేదని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆమె తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, ఆమె గౌరవప్రదమైన జీవితం గడపాల్సిన అవసరం ఉందని, ఆమెకు భారత్ మొత్తం చూపెట్టాలని నిర్ణయించుకున్నానని కృష్ణ కుమార్ తెలిపాడు .
మనోజ్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. కృష్ణకుమార్ కు ఓ కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఇదో అద్భుతమైన జీవితగాథ అని, కృష్ణకుమార్ కు తల్లి పైనే కాకుండా దేశంపై కూడా చాలా ప్రేమ ఉందని అన్నారు.
తనను కృష్ణ కుమార్ కలిసేలా మనోజ్ కుమార్ సాయం చేస్తే, మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్ టీ కారును కృష్ణకుమార్ కు బహుమతిగా ఇస్తానని అన్నారు. దీంతో తన తల్లిని ఆయన కారులో కూర్చోబెట్టి తదుపరి యాత్రను కొనసాగించొచ్చని ట్వీట్ చేశారు.