Yuvraj Singh: బీసీసీఐ నిబంధనలు మా కొంప ముంచాయి: యువరాజ్ సింగ్
- రిజర్వ్ డే ఉంటే మ్యాచ్ లో పంజాబ్ గెలిచేది
- దేశవాళీ టోర్నీ అని రిజర్వ్ డే పెట్టలేదా ?
- పోరాడకముందే ఓటమి అంగీకరించాల్సి వచ్చింది
విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టు సెమీస్ చేరకపోవడానికి బీసీసీఐ నిబంధనలు కారణమని భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఆరోపించాడు. ఈ ట్రోఫీలో భాగంగా పంజాబ్ జట్టు, తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 12.2 ఓవర్లు ముగిసేసరికి వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది.
అప్పటికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఎంత సేపటికీ వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్ ను ఫలితం తేలని మ్యాచ్ గా అంపైర్లు ప్రకటించారు. రిజర్వ్ డే ఉంటే మ్యాచ్ లో ఫలితం తేలేదని యువరాజ్ వ్యాఖ్యానించాడు. ‘క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుతో పూర్తిగా పోరాడకముందే టోర్నీనుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సాధించిన పాయింట్ల ప్రకారం సెమీస్ చేరలేకపోయింది. విజయ్ హజారే ట్రోఫీలో ఎందుకు రిజర్వ్ డే లేదు? దేశవాళీ టోర్నమెంట్ అని రిజర్వ్ డే పెట్టలేదా ?’ అంటూ బీసీసీఐని ట్విట్టర్ లో ప్రశ్నించాడు.
బీసీసీఐ రిజర్వ్ డేపై పునరాలోచించాలి: భజ్జీ
మరోవైపు క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఇదేరీతిలో స్పందించాడు. ‘రిజర్వ్ డే ఎందుకు పెట్టలేదు, బీసీసీఐ దీనిపై ఆలోచించి మార్పులు చేయాలి’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. సెమీస్ కు చేరిన జట్లలో కర్ణాటక, ఛత్తీస్ గఢ్, గుజరాత్, తమిళనాడులు ఉన్నాయి.