Maharashtra: లేటెస్ట్ ట్రెండ్స్... మహారాష్ట్ర బీజేపీదే... హర్యానా డౌటే!
- మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ కన్నా అధిక చోట్ల గెలుపునకు అవకాశం
- 2014తో పోలిస్తే తగ్గనున్న సీట్లు
- హరియాణాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ
- అత్యంత కీలకమైన జేజేపీ మద్దతు
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ సగానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో లభించిన స్థానాలతో పోలిస్తే, బీజేపీ - శివసేన కూటమికి సీట్లు తగ్గినప్పటికీ, అధికార పీఠం మాత్రం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తం 288 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా, ప్రస్తుతం బీజేపీ 162 స్థానాల్లో ముందంజలో ఉండి, ఒక చోట గెలిచింది. కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి 93 స్థానాల్లో, ఇతరులు 32 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో రెండో అతిపెద్ద పార్టీగా శివసేన అవతరించనుంది.
ఇక హర్యానా విషయానికి వస్తే, హంగ్ ఖాయంగా తెలుస్తోంది. 90 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 46 కాగా, ఏ పార్టీ కూడా అన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు లేవు. అయితే, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు పుష్కలం. తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 38, కాంగ్రెస్ 32, ఐఎన్ఎల్డీ 2, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10, ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో జేజేపీ కింగ్ మేకర్ గా అవతరించనుండగా, ఇండిపెండెంట్లు అత్యంత కీలకం కానున్నారు.