shiv sena: ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలి: బీజేపీ ముందు శివసేన డిమాండ్
- ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావడానికి వెళ్తున్నానన్న సంజయ్ రౌత్
- బీజేపీతో మా మిత్రత్వం కొనసాగుతుంది
- 50-50 ఫార్ములా అమలు చేయాలి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. స్పష్టమైన ఆధిక్యం సాధించే దిశగా ఈ కూటమి దూసుకుపోతుండడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తమకు ఉన్న అభిప్రాయాన్ని శివసేన బయటపెట్టింది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని కోరనున్నట్లు శివసేన స్పష్టం చేసింది.
వర్లి నుంచి పోటీ చేసిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని కోరతామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... 'నేను మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావడానికి వెళ్తున్నాను. బీజేపీతో మా మిత్రత్వం కొనసాగుతుంది. ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరతాం. 50-50 ఫార్ములా అమలు చేయాలి' అని వ్యాఖ్యానించారు.
ఇరు పార్టీల నేతలు రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రిగా కొనసాగాలని శివసేన భావిస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ 99, శివసేన 60, ఎన్సీపీ 48, కాంగ్రెస్ 40 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో తమ కూటమి గెలుపొందితే దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎం బాధ్యతలు చేపడతారని ఇటీవల పలుసార్లు బీజేపీ నేతలు తెలిపారు. శివసేన డిమాండ్ పై బీజేపీ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు.