Tamil Nadu: ఉప ఎన్నికల్లో డీఎంకేకు షాకిచ్చిన తమిళ ఓటర్లు : రెండు స్థానాల్లోనూ వెనుకబాటే
- ఆశ్చర్యపోతున్న రాజకీయ వర్గాలు
- ఇక అధికారానికి ఆమడ దూరంలోనే అని ప్రచారం
- ఇంతలోనే ఈ మార్పు దేనికి సంకేతం?
తమిళనాడులో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకేకు షాక్ తగిలింది. రాష్ట్రంలోని నంగునోరి, విక్రవండి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ జోరు మీదుండడం డీఎంకే వర్గాలను, ఆ పార్టీ అధినేత స్టాలిన్ను అమితాశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడమే తరువాయి, డీఎంకేకు అధికారం ఖాయం, స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న తరుణంలో ఈ అనూహ్య మార్పు దేనికి సంకేతమని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ట్రెండ్స్బట్టి చూస్తే రెండు స్థానాల్లో అధికార అన్నాడీఎంకే గెలుపు లాంఛనమే అని భావిస్తున్నారు.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాలకుగాను 22 స్థానాలను గెల్చుకుని డీఎంకే మంచి జోరుమీదున్నట్టు కనిపించింది. ఉప ఎన్నికల్లోనూ ఇదే జోరు కనిపిస్తుందని అంతా భావించారు. కానీ, ఓటర్లు షాక్ ఇవ్వడంతో డీఎంకే వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
మరోవైపు వరుసగా ఎదురు దెబ్బలతో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకేకు ఈ ఉప ఎన్నికల ఫలితం జీవం పోస్తుందనడంలో సందేహం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడే అంచనా వేయలేం.