Haryana: ఆసక్తికరంగా మారిన హర్యానా రాజకీయాలు.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్
- జేజేపీ, ఐఎన్ఎల్డీతో కలుస్తామన్న మాజీ సీఎం భూపిందర్ సింగ్
- భూపిందర్ సింగ్ తో మాట్లాడిన సోనియా
- ఖట్టర్ ను వెంటనే ఢిల్లీకి రమ్మన్న అమిత్ షా
హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు కనపడట్లేదు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీల సాయం తీసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. జననాయక్ జనతా పార్టీ, ఐఎన్ఎల్డీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.
కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ... 'జేజేపీ, ఐఎన్ఎల్డీతో కలిసి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం' అని తెలిపారు. భూపిందర్ సింగ్ తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడారు. మరోవైపు, ఢిల్లీకి రావాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా నుంచి పిలుపువచ్చింది.