Odisha: దెయ్యం ఉందని నిరూపిస్తే నగదు బహుమతి ఇస్తానన్న కలెక్టర్!
- ఒడిశాలో ఓ ఐఏఎస్ వినూత్న ప్రయత్నం
- దెయ్యాన్ని చూపిస్తే రూ.50 వేలు ఇస్తానన్న గంజాం జిల్లా కలెక్టర్
- సొంత డబ్బులు ఇస్తానని వెల్లడి
భారత్ లో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్న సంగతి తెలిసిందే. ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రజల్లో దెయ్యం, చేతబడి వంటి నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. అయితే, ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కులాంగే ఓ ప్రకటన చేశారు. ఎవరైనా దెయ్యాలు ఉన్నాయని ఆధారాలతో సహా వస్తే వారికి రూ.50 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. దెయ్యాన్ని చూపించినవారికి తన సొంత డబ్బులే ఇస్తానని తెలిపారు. ప్రజల్లో మూఢనమ్మకాలు, క్షుద్రపూజల పట్ల భయాలను పోగొట్టడానికి విజయ్ కులాంగే ఈ ప్రయత్నం చేస్తున్నారు. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని, నాటు వైద్యాలు, ఇతర మంత్రవిద్యలను ఆశ్రయించరాదని ఆయన స్పష్టం చేశారు.