TSRTC: ఆర్టీసీ కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదు: అశ్వత్థామ రెడ్డి
- ఉద్యోగులను తీసేసే అధికారం ఎవరికీ లేదు
- ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకుంటే కోర్టులు ఊరుకోవు
- కేసీఆర్ కు ఎప్పుడూ ఎన్నికల ధ్యాసే
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగగానే సీఎం కేసీఆర్ సమ్మెకు దిగిన కార్మికులు డిస్మిస్ అయినట్లేనని ప్రకటించడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా వారిని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. సీఎం వైఖరిని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు.
ఉద్యోగులను తీసేసే అధికారం ఎవరికీ లేదన్నారు. నాగర్ కర్నూల్ లో కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ, కేసీఆర్ మాటలకు కార్మికులు భయపడ వద్దన్నారు. సీఎంగా కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకుంటే కోర్టులు ఊరుకుంటాయా? అని ఆశ్వత్థామ ప్రశ్నించారు.
‘ఆర్టీసీ కార్మికులను అవమానించేలా సీఎం మాట్లాడారు. కార్మికుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. మావి గొంతెమ్మ కోర్కెలు కావు. యూనియన్లు ఉన్నాయి కాబట్టే ఆర్టీసీ ఆస్తులు కాపాడుకోగలిగాము. ఉద్యోగాలు తీసేసేందుకు మేము ఫాంహౌస్ లో పాలేర్లం కాదు. ఆర్థిక మాంద్యం ఒక్క తెలంగాణలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ధనిక రాష్టం అని చెప్పిన మూడేళ్లలోనే నష్టాల్లోకి వచ్చిందా? కేసీఆర్ కు ఎప్పుడూ ఎన్నికల ధ్యాసే’ అని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. 30న సరూర్ నగర్ లో నిర్వహించనున్న సకలజనుల సమరభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.