Srisailam: కృష్ణానదికి భారీగా వరద... నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరో 6 గేట్లను ఎత్తిన అధికారులు!
- బుధవారం నాడు 12 గేట్లు ఎత్తిన అధికారులు
- నదిలో 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద
- ప్రకాశం బ్యారేజ్ దిగువన అప్రమత్తం
తూర్పు కర్ణాటకలో వర్షాలు తగ్గక పోవడంతో, కృష్ణానదిలో వరద కొనసాగుతోంది . వరద నీటిని ఎక్కడా నిల్వ చేసేందుకు అవకాశాలు లేకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్టుగా సముద్రంలోకి వెళుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి, దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ వరకూ అన్ని పంట కాలువలు, ఎత్తి పోతల పథకాలకు నీరు అందిస్తున్నప్పటికీ, నదిలో ప్రవహిస్తున్న వరద 5 లక్షల క్యూసెక్కులకు పైగానే కొనసాగుతోంది.
గత రాత్రి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని పెంచడంతో, మరో ఆరు గేట్లను సాగర్ అధికారులు తెరిచారు. నిన్నటివరకూ 12 గేట్లను 15 అడుగుల మేరకు తెరచివుంచిన అధికారులు, నేడు 18 గేట్లను 20 అడుగుల మేరకు తెరిచారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 309 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతానికి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నామని, వరద నీటి ప్రవాహం తగ్గితే, కొన్ని గేట్లను దించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
కాగా, కృష్ణలో వరద నీటి ప్రవాహం పెరగడంతో, ప్రకాశం బ్యారేజ్ దిగువన అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం సిద్ధం కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.