brazil: వీసా లేకుండానే మా దేశానికి రావచ్చు: భారతీయులకు కూడా బ్రెజిల్ ఆహ్వానం
- చైనా పర్యటనలో ప్రకటించిన బ్రెజిల్ అధ్యక్షుడు
- ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియాలకూ ఈ సదుపాయం
- కొత్తగా భారత్ తో పాటు చైనాకు చోటు
చైనా పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో.. భారతీయులకు ఓ సదుపాయాన్ని ప్రకటించారు. వీసా లేకుండానే తమ దేశానికి రావచ్చని తెలిపారు. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియాకు కూడా బ్రెజిల్ ఈ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా, భారత్ తో పాటు చైనాను కూడా ఆయన ఈ జాబితాలో చేర్చారు. ఈ దేశాలు మాత్రం బ్రెజిల్ పౌరులకు వీసా లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించలేదు.
ఆయా దేశాల పర్యాటకులు, వ్యాపారులు వీసా లేకుండానే బ్రిజిల్ వెళ్లవచ్చు. జేర్ బోల్సొనారో గతేడాది బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పలుసార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల అమెజాన్ అడవిలో కార్చిచ్చుపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎన్జీవోల వల్లే ఈ మంటలు చెలరేగాయన్నారు.