Gova: వాతావరణం అనుకూలంగా లేదు...గోవా రావద్దు: సందర్శకులకు వాతావరణ శాఖ హెచ్చరిక
- తుపాన్ నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన గోవా కేంద్రం
- మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటన
- బీచ్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి
దేశంలోని సొగసైన పర్యాటక కేంద్రంగా పేరొందిన గోవాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యాటకులు ఎవరూ రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. గోవాలోని వాతావరణ హెచ్చరిక కేంద్రం ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుపాన్ బీభత్సం కారణంగా ప్రస్తుతం గోవాలో భారీ వర్షాలతోపాటు వాతావరణం అల్లకల్లోలంగా ఉందని స్పష్టం చేసింది. అందువల్ల ఇప్పటికే ప్రయాణాలు ఖరారు చేసుకున్నవారు, రావాలని భావిస్తున్న వారు మనసు మార్చుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఇప్పటికే గోవాలో భారీ వర్షం కురుస్తోందని, మరో ఐదు రోజులపాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని, జన జీవనానికి ఆటంకం ఏర్పడుతుందని పేర్కొంది.
అలాగే, సందర్శకుల ప్రధాన ఆకర్షణ బీచ్ అని, కానీ ప్రస్తుతం కెరటాలు ప్రమాదకరంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని తెలిపింది. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ సందర్శకులు వచ్చేందుకు సాహసించవద్దని గోవా వాతావరణ కేంద్రం డైరెక్టరు కే.వి.పడ్గాల్ వార్ హెచ్చరించారు.