chidambaram: చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ రద్దు చేయండి: సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ పిటిషన్లు
- విడివిడిగా పిటిషన్ లు దాఖలు చేసిన సీబీఐ, ఈడీ
- ఢిల్లీలోనే ఉన్న డీకే శివకుమార్
- కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఇటీవల సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్.. ఢిల్లీ హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందారు. అయితే, వీరిద్దరి బెయిల్ లను రద్దు చేయాలని ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ విడివిడిగా పిటిషన్ లు దాఖలు చేశాయి. కాగా, ఇటీవల రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన జైలునుంచి విముక్తి అయ్యే అవకాశం లేకుండాపోయింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకి సంబంధించిన ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.
మరోవైపు, ఈడీ విచారణలు ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈ కేసులో తన తల్లి, భార్యకు ఈడీ జారీ చేసిన నోటీసుల నుంచి మినహాయింపు కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ల విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. ఆయన నిన్న సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిసి కేసుల విషయమై చర్చించారు. అంతకు ముందు కూడా కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, అహ్మద్పటేల్లతో చర్చించారు.