Facebook: ఫేస్ బుక్ నుంచి కొత్త అప్ డేట్... ప్రస్తుతానికి అమెరికాలోనే...!
- ఫేస్ బుక్ లో న్యూస్ విభాగం
- మీడియా సంస్థల కథనాలకు చోటు
- అమెరికాలో పైలెట్ ప్రాజెక్టు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కొత్త అప్ డేట్ తో వచ్చింది. ఇప్పటికే పోస్టులకు సంబంధించి న్యూస్ ఫీడ్ ఫీచర్ ఉన్నా, తాజా వార్తలు, కథనాల కోసం ప్రత్యేకంగా న్యూస్ విభాగాన్ని ప్రారంభిస్తోంది. ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్దిమంది యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆపై మరింత మెరుగుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తారు.
స్థానిక మీడియా సంస్థల కథనాలు, పాత్రికేయులు ఎంపిక చేసిన కథనాలకు ఫేస్ బుక్ న్యూస్ విభాగంలో చోటు కల్పిస్తారు. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా వార్తలు కనిపించేలా ఈ న్యూస్ విభాగాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, పెయిడ్ న్యూస్ సబ్ స్క్రిప్షన్లను ప్రచారం చేసుకునే వారికి అనువుగా ఇందులోనే ప్రత్యేక విభాగం ఉంటుంది.