honkong: 135 చదరపు అడుగుల పార్కింగ్ స్థలం...ఖరీదు రూ.7 కోట్ల పైమాటే!
- వాణిజ్య భవనం ఎదుట స్థలానికి పలికిన ధర ఇది
- ప్రపంచ ఆర్థిక రాజధాని హాంకాంగ్‌లో నిర్మాణం
- జానీ చెయుంగ్ అనే వ్యాపారి అమ్మకం
నివాసిత ప్రాంతమైనా, వాణిజ్య సముదాయమైనా బహుళ అంతస్తు భవనం (అపార్ట్మెంట్) అయితే కనుక దానికి పార్కింగ్ స్థలం తప్పనిసరి. కారు వంటి వాహనాన్ని పార్క్ చేసుకునేందుకు ఇల్లు/దుకాణంతోపాటు పార్కింగ్ స్థలాన్ని కూడా కొనుక్కోవాలి. ఇందుకోసం భవనం ఉన్న ప్రాంతం, స్థాయిని బట్టి ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ పార్కింగ్ స్థలమే రూ.7కోట్ల ధర పలికిందంటే నమ్మగలరా?.. కానీ ఇది నిజం!
ప్రపంచ ఆర్థిక రాజధానిగా, భోజన ప్రియులకు భూతల స్వర్గంగా పేరొందిన హాంకాంగ్‌లోని ఓ వాణిజ్య భవనం ఎదుట ఉన్న కార్ పార్కింగ్ స్థలానికి పలికిన ధర ఇది. హాంకాంగ్ నడిబొడ్డున ఉన్న అరవై తొమ్మిది అంతస్తుల అత్యంత ఖరీదైన కమర్షియల్ భవనం.. స్టీల్ ఆఫీస్ టవర్ ఎదురుగా ఉన్న ఈ ఓపెన్ ప్లేస్ లో జానీ ఛెయుంగ్ అనే వ్యాపారికి 135 చదరపు అడుగుల పార్కింగ్ స్థలం ఉంది.
దీన్ని అతను అమ్మకానికి పెట్టాడు. ఈ స్థలాన్ని ఓ వ్యక్తి తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. అయితే కొన్న వ్యక్తి ఎవరన్నది మాత్రం ఈ పత్రిక బయటపెట్ట లేదు.