America: అమెరికాలో దీపావళి వేడుకలు...హాజరైన అధ్యక్షుడు ట్రంప్
- శ్వేత సౌధంలో పండుగ కోలాహలం
- ప్రముఖ ఎన్‌ఆర్‌ఐలు, శ్వేతసౌధం సిబ్బంది హాజరు
- మత స్వేచ్ఛ అమెరికా విధానం అన్న అధ్యక్షుడు
భారతీయులు ఆనందంగా జరుపుకొనే దీపావళి వేడుకలను అగ్రరాజ్యం అమెరికాలో ఈరోజు ఉత్సాహంగా ప్రారంభించారు. వైట్‌హౌస్ (శ్వేతసౌధం)లో జరిగిన వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ ప్రవాస భారతీయులు, శ్వేతసౌధం సిబ్బంది పాల్గొన్న వేడుకలతో అక్కడ సందడి నెలకొంది. పండుగ జరుపుకొంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దేశ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటైన మతస్వేచ్ఛకు దీపావళి వేడుకలు నిదర్శనమన్నారు. దేశంలోని అన్నిమతాల ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా పండుగ జరుపుకొనే స్వేచ్ఛ అమెరికా కల్పిస్తోందని, వారి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లో 2009 నుంచి వేడుకలు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది.