Vidadala Rajini: వైసీపీ ఎమ్మెల్యే రజని కాల్ రికార్డును బయటపెట్టినందుకు సస్పెండైన హెడ్మాస్టర్
- శారదా హైస్కూల్ కమిటీని రద్దు చేయాలంటూ హెచ్ఎంను ఆదేశించిన రజని
- వాయిస్ రికార్డును కమిటీకి వినిపించిన హెచ్ఎం
- తీవ్ర ఆగ్రహానికి గురైన రజని
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని కాల్ రికార్డును బయటపెట్టిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే, చిలకలూరిపేట శారదా హైస్కూల్ విద్యా కమిటీపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న రజని ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మికి ఫోన్ చేసి కమిటీని రద్దు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కమిటీకి ధనలక్ష్మి తెలియజేశారు. అంతేకాకుండా, రజని తనతో మాట్లాడిన వాయిస్ రికార్డును కూడా కమిటీ ముందు వినిపించారు.
ఈ విషయం తెలుసుకున్న రజని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధనలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ధనలక్ష్మిని అధికారులు సస్పెండ్ చేశారు.