Chiranjeevi: చిరంజీవి అధికారంలోకి రాకపోవడం వల్లే పవన్ కల్యాణ్ 'ప్రజారాజ్యం'కు దూరమయ్యాడు: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- పవన్ పై వెల్లంపల్లి విమర్శలు
- ఇసుక అంశంలో జగన్ పై విమర్శలు సరికాదని హితవు
- నదులు పొంగిపొర్లుతుంటే ఇసుక ఎలా తవ్వుతారన్న వెల్లంపల్లి
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అధికారం లేకుండా ఉండలేడని, గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తోకలా వ్యవహరించారని, ఇప్పుడు పవన్ కన్ను బీజేపీపై పడిందని అన్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవికి అధికారం దక్కకపోయేసరికి ఆయన నుంచి దూరంగా వచ్చేశాడని ఆరోపించారు. ఎలాగైనా మోదీతో జట్టు కట్టేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అందుకే సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నాడని, జగన్ ను విమర్శిస్తే ప్రజలు మద్దతు పలుకుతారనే భ్రమలో పవన్ కల్యాణ్ ఉన్నాడని అన్నారు.
ఇసుక అంశంలో పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఓవైపు నదులు పొంగిపొర్లుతుంటే ఇసుక ఎలా తవ్వుతారని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. పవన్ ఓసారి విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్దకు వచ్చి చూడాలని, వరద పోటెత్తుతోందని తెలిపారు. వెల్లంపల్లి గతంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే.