Mahabubabad District: హత్య పథకం బెడిసికొట్టింది.. నిందితుడిని పోలీసులకు పట్టించిన శబ్దం!
- ప్రత్యర్థిని హతమార్చేందుకు కుట్ర
- రూ.20 వేలు ఖర్చు చేసి యూపీ నుంచి తుపాకి కొనుగోలు
- పరీక్షించే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితుడు
వ్యక్తిని హతమార్చేందుకు తుపాకి కొని, అది పనిచేస్తుందో, లేదో పరీక్షించే క్రమంలో పోలీసులకు చిక్కాడో వ్యక్తి. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని తిమ్మసానిపల్లెకు చెందిన వరద రవికి అదే గ్రామానికి చెందిన రవికుమార్ యాదవ్‌తో పాతకక్షలున్నాయి. రెండేళ్ల క్రితం డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రవికుమార్, వరద రవి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రవికుమార్‌తోపాటు మరో వ్యక్తిపై రవి వర్గం హత్యాయత్నానికి పాల్పడింది.
ఈ క్రమంలో రవికుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించిన వరద రవి తిమ్మసానిపల్లె నుంచి తన మకాంను జడ్చర్లకు మార్చాడు. అక్కడ ఓ గప్‌చుప్ వ్యాపారి సాయంతో నాలుగు నెలల క్రితం రూ.20 వేలు ఖర్చు చేసి ఉత్తరప్రదేశ్ నుంచి తుపాకి తెప్పించుకున్నాడు. దాని సాయంతో రవికుమార్‌ను హతమార్చాలని పథకం పన్నాడు. దీంతో తన మకాంను జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌లోని లక్ష్మీనగర్‌కు మార్చాడు. అప్పుడప్పుడు స్వగ్రామం తిమ్మసానిపల్లెకు వెళ్లి వస్తూ రవికుమార్‌పై నిఘా పెట్టాడు.
రవికుమార్‌ను హత్య చేసేముందు తుపాకి పనిచేస్తుందో, లేదో తెలుసుకునేందుకు పరీక్షించాలనుకున్నాడు. దీంతో తన బంధువైన కన్నయ్యతో కలిసి శుక్రవారం రాత్రి తిమ్మసానిపల్లె రైల్వే ట్రాక్ వద్దకు రవి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపి పనిచేస్తుందని నిర్ధారించుకున్నారు. అయితే, ఆ పక్కనే ఉన్న పోలీసులు శబ్దం విని పరిగెత్తుకుంటూ ట్రాక్ వద్దకు వచ్చారు. అక్కడ తుపాకితో కనిపించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.