Tamilnadu: పొద్దుపొద్దున్నే టపాసుల పేలుళ్లతో మోతెక్కిపోయిన తమిళనాడు!
- అంబరాన్ని అంటిన సంబరాలు
- ఉదయం 6 గంటల నుంచే సందడి
- సాయంత్రం మరో గంట పాటు టపాసుల పేలుళ్లు
తమిళనాడులో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఉదయం పేలుళ్లతో వీధులన్నీ మోతెక్కిపోయాయి. చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొద్దున్నే ప్రజలు టపాసుల మోత మోగించారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి పండగను ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు బాణసంచా కాల్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అనుమతించగా, ఈ ఉత్తర్వులు సడలించాలని, ఉదయం పూట కాల్చడం తమ సంప్రదాయమని తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును సడలిస్తూ, రోజులో ఎప్పుడైనా రెండు గంటల పాటు టపాసులు కాల్చుకునేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.