Dushyant Choutala: తీహార్ జైలు నుంచి విడుదలైన దుష్యంత్ చౌతాలా తండ్రి
- ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఆరోపణలు
- తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అజయ్ చౌతాలా
- పెరోల్ మంజూరు చేసిన కోర్టు
హర్యానాలో సంచలన విజయం సాధించి, కింగ్ మేకర్ గా అవతరించిన జననాయక జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పెరోల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కేసులో వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో, ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ 10 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆయన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు మంత్రి పదవులను దుష్యంత్ కు ఆఫర్ చేసింది. ఫలితాలు వెల్లడైన వెంటనే జైలులో ఉన్న తండ్రిని దుష్యంత్ కలుసుకున్నారు. ఆయన సూచన మేరకే బీజేపీతో చేతులు కలిపారు. నేడు జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు దుష్యంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.