shiv sena: రిమోట్ కంట్రోల్ ఇప్పుడు మా చేతిలో ఉంది: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన
- చిరుత పులి చేతిలో కమలం ఉంది
- ఇటీవల వేసిన ఓ కార్టూను మహారాష్ట్ర పరిస్థితులను చక్కగా అభివర్ణిస్తోంది
- 144 సీట్లు గెలుచుకోవాలన్న బీజేపీ వ్యూహాన్ని ఓటర్లు తిప్పికొట్టారు
ఐదేళ్ల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈ సారి తమ పార్టీకి సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే విషయంలో రిమోట్ కంట్రోల్ శివసేన చేతిలోనే ఉందని ఆ పార్టీ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 63 సీట్లలో విజయం సాధించిన శివసేన.. 2019 ఎన్నికల్లో 56 స్థానాల్లో గెలుపొందింది. మరోవైపు, 2014లో 122 సీట్లు గెలుచుకున్న బీజేపీ కూడా ఈ సారి పలు స్థానాలను కోల్పోయింది. 105 నియోజక వర్గాల్లో గెలుపొందింది.
ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ దక్కని నేపథ్యంలో శివసేన మద్దతు తప్పనిసరి అయింది. దీంతో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. 'శివసేన గతంలో కంటే ఈ సారి తక్కువ స్థానాల్లో గెలుపొందింది. అయినప్పటికీ, రిమోట్ కంట్రోట్ మా పార్టీ చేతిలో ఉంది. ఇటీవల ఓ కార్టూన్ ప్రచురించాం. అందులో మా పార్టీ ఎన్నికల గుర్తు చిరుత పులి చేతిలో కమలం (బీజేపీ ఎన్నికల గుర్తు) ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఇది చక్కగా అభివర్ణించి చెబుతోంది' అని అని తమ పార్టీ పత్రిక సామ్నాలో శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
'164 స్థానాల్లో పోటీ చేసి కనీసం 144 సీట్లు గెలుచుకోవాలన్న బీజేపీ వ్యూహాన్ని ఓటర్లు తిప్పికొట్టారు. బీజేపీ అనైతిక ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ ఫలితాలు వచ్చాయి. బెదిరిస్తూ, ఆశచూపుతూ కాంగ్రెస్-ఎన్సీపీ కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా అసెంబ్లీలో తమ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావించింది' అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
'రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పని అయిపోయిందంటూ వచ్చిన వ్యాఖ్యలను ప్రజలు ఒప్పుకోలేదు. తమ ఓట్ల ద్వారా ఈ విషయాన్ని ప్రజలు తెలియజేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీకి అధికంగా ఓట్లు పడ్డాయి. 2014లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలను శివసేన నిరోధించింది. 2019 ఎన్నికల్లో బీజేపీని శరద్ పవార్ నిరోధించారు' అని సంజయ్ రౌత్ సామ్నాలో తెలిపారు.