Vallabhaneni Vamsi: కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టం.. చంద్రబాబు లేఖపై వల్లభనేని వంశీ స్పందన!
- నిన్న టీడీపీకి రాజీనామా చేసిన వంశీ
- రాజీనామాలు పరిష్కారం కాదంటూ చంద్రబాబు ప్రత్యుత్తరం
- అవమానాలు భరించలేకపోతున్నానని మరో లేఖ రాసిన వంశీ
తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వల్లభనేని వంశీ, చంద్రబాబుకు లేఖ రాయగా, చంద్రబాబు స్పందించిన సంగతి తెలిసిందే. వంశీకి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వగా, దానిపై వంశీ స్పందించారు. తన లేఖపై స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు అడుగు జాడల్లో తాను నడిచి, ప్రభుత్వ హింసను ఎదుర్కొన్నానని అన్నారు. జిల్లాలో పార్టీ మద్దతు తనకు లభించకపోయినా, రాజ్యాంగ బద్ధమైన సంస్థల సాయంతో అన్యాయాలపై పోరాడానని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని తనపై ఒత్తిడి తెచ్చిన సంగతి మీకు తెలుసునని, అయితే, కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేసిన పలు సందర్భాలను ఉటంకిస్తూ, గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, అధ్యక్షుడి ఆదేశం మేరకు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన వేళ, కాంగ్రెస్ అరాచకాలపై పోరాడానని అన్నారు.
ఎన్నికల తరువాత తనను ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయని ఈ లేఖలో పేర్కొన్న వంశీ, రాజకీయంగా వేధిస్తున్నారని, అనుచరులపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తన వారిని ఇబ్బందుల పాలు చేయడం ఇష్టం లేకనే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.