Raghavachari: రాఘవాచారి మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం
- రాఘవాచారి జీవితం ఆదర్శప్రాయమన్న కేసీఆర్
- విలువ ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారన్న జగన్
- రాఘవాచారి సేవలు చిరస్మరణీయమన్న బాబు
ప్రముఖ పాత్రికేయుడు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ రాఘవాచారి మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా రాఘవాచారి జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రాఘవాచారి విలువ ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని ఏపీ సీఎం జగన్ కొనియాడారు. రాఘవాచారి రచనల్లో విలువ ఆధారిత జర్నలిజం ప్రతిబింబిస్తుందన్న జగన్.. ఆయన రచనలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయన్నారు.
విశాలాంధ్ర ఎడిటర్‌గా రాఘవాచారి సేవలు చిరస్మరణీయమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన గొప్ప వ్యక్తి రాఘవాచారి అని పేర్కొన్నారు. వృత్తిలో నిబద్ధత చూపి సమకాలీన పాత్రికేయులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి ఈ తెల్లవారుజామున ఆసుపత్రిలో కన్నుమూశారు.