Rana: అది మధ్యలోనే ఆగిపోయిన సినిమా... పోస్టర్ ఎలా రిలీజ్ చేస్తారు?: నిర్మాతపై రానా అసహనం
- '1945' సినిమాపై వివాదం
- దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన యూనిట్
- ఇది మోసపూరిత చర్య అని రానా ఆరోపణ
నటుడు దగ్గుబాటి రానా ఓ చిత్ర నిర్మాతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానా కొన్నాళ్ల కిందట 1945 అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. తాజాగా దీపావళి నాడు 1945 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. దీనిపై రానా అసహనం ప్రదర్శించారు.
ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయిందని, ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమంటే డబ్బుల కోసం మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత విఫలమయ్యాడని, ఏడాదిగా చిత్రబృందం తనను సంప్రదించలేదని, తాను కూడా వాళ్లను కలవలేదని రానా స్పష్టం చేశాడు. మధ్యలోనే ఆగిపోయిన సినిమాకు ఏ విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారో చెప్పాలని రానా నిలదీశారు.
దీనిపై 1945 చిత్ర నిర్మాత రాజరాజన్ స్పందించారు. సినిమా పరిస్థితి ఏంటన్నది దర్శకుడు నిర్ణయిస్తాడు, సినిమా పూర్తయిందో లేదో ప్రేక్షకులకు వదిలేయండి అని వ్యాఖ్యానించారు. రెండు నెలల షూటింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, మధ్యలోనే ఆగిపోయిన చిత్రాన్ని ఎవరూ విడుదల చేయాలనుకోరు అని బదులిచ్చారు.
సత్యశివ దర్శకత్వంలో కొన్నేళ్ల కిందట 1945 చిత్రాన్ని ప్రకటించారు. స్వాతంత్ర్యం రాకముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించాలని భావించారు. ఇందులో రానాది బోస్ ఆర్మీ సైనికుడి పాత్ర అని, రానాకు జతగా రెజీనా కసాండ్రా ఓ చెట్టియార్ల అమ్మాయిగా కనిపిస్తుందని మీడియాలో కథనాలు వచ్చాయి.