Shakib Al Hasan: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ పై చర్యలు లేనట్టే... ఉదారంగా వ్యవహరించాలని బోర్డు నిర్ణయం
- టెలికాం సంస్థతో షకీబల్ ఒప్పందం
- నియమావళికి విరుద్ధమన్న బంగ్లా క్రికెట్ బోర్డు
- షకీబల్ వివరణ ఇస్తే చాలంటూ తాజా ప్రకటన
నిబంధనలకు విరుద్ధంగా ఓ టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వాస్తవానికి కాంట్రాక్టు లిస్టులో ఉన్న ఆటగాళ్లు టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం బోర్డు నియమావళికి విరుద్ధం. షకీబల్ ఈ నిబంధన ఉల్లంఘించడంతో బోర్డు నోటీసులు పంపింది. అతడి నుంచి వివరణ కోరింది.
అయితే, మరికొన్ని రోజుల్లో భారత పర్యటన ప్రారంభం కానున్న తరుణంలో షకీబల్ పై చర్యలు తీసుకుంటే జట్టు బలహీనపడడంతో పాటు, బోర్డుకు ఆటగాళ్లకు మధ్య మరింత ఎడం పెరుగుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ పెద్దలు భావించారు. అందుకే షకీబల్ నుంచి కేవలం వివరణ కోరి ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలని నిర్ణయించారు.
దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హుస్సేన్ స్పందిస్తూ, ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంతర్గత వ్యవహారం అని, దీనికి ఇంతటితో ముగింపు పలకాలనుకుంటున్నామని తెలిపారు. షకీబల్ పై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు.