TSRTC: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు.. విచారణ రేపటికి వాయిదా
- ఎల్లుండికి గడువు కోరిన ప్రభుత్వం
- నిరాకరించిన కోర్టు
- రేపు మధ్యాహ్నం 2.30గంటలకు మరోసారి విచారణ
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎల్లుండివరకు గడువు కావాలని కోరగా, కోర్టు నిరాకరించింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది.
అంతకు ముందు వాదనలు కొనసాగుతున్న సమయంలో.. కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.175 కోట్ల నష్టం వచ్చిందని, రాజకీయ పార్టీలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ.. చర్చల వివరాలను తెలుపుతూ అదనపు అడ్వకేట్ జనరల్ అదనపు కౌంటర్ దాఖలు చేశారు. ఈడీల కమిటీ 21 అంశాలను పరిశీలించి ఆర్టీసీ ఎండీకి నివేదిక సమర్పించిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు.
వీటిలో 18 డిమాండ్లను నెరవేర్చడానికి సరిపడా నిధులు సంస్థ వద్దలేవని ఈడీ నివేదికలో పేర్కొందని రామచంద్రరావు తెలిపారు. మరి ఈడీ కమిటీ నివేదిక తమకెందుకు సమర్పించలేదని కోర్టు ప్రశ్నించింది. నివేదికలు కోర్టుకు కూడా తెలపరా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఓవర్ నైట్లో ఆర్టీసీ విలీనం ఎలా జరుగుతుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్లు సాధ్యం కాదని ముందే నిర్ణయం తీసుకున్నారా? అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
కార్మికుల వేతనాలు పెంచామని కోర్టుకు అర్టీసీ పేర్కొంటూ.. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ఏఏజీ తన వాదనలో పేర్కొనగా, కోర్టు స్పందిస్తూ.. 'చట్ట విరుద్ధమని చెపుతున్నారు, మరి వారిపై చర్యలు ఏమైనా తీసుకున్నారా?' అని ప్రశ్నించింది. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని కోర్టు ప్రశ్నించగా, ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి రూ.450 కోట్లు ఇచ్చిందని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో కల్పించుకున్న కోర్టు, 'మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి ప్రభుత్వ కార్యదర్శిని, ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలుస్తాం' అని వ్యాఖ్యానించింది.
అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆర్టీసీ తరపున వాదనలు వినిపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ను హాజరుకావాలని కోర్టు పిలిపించింది. అనంతరం ప్రసాద్ ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగించారు. కార్మికుల తీరు సరిగా లేదని ప్రసాద్ కోర్టుకు తెలిపారు.