Mamata Banarjee: మమతా బెనర్జీ ఇంట్లో దీపావళి పూజ.. గవర్నర్ దంపతుల సందడి!
- ఇటీవల ఇరువురి మధ్య పొడసూపిన విభేదాలతో భేటీకి ప్రాధాన్యం
- మమత ఆతిథ్యం అద్భుతమంటూ ప్రశంసలు
- మమత మేనల్లుడు ఎంపీ అభిషేక్ తో మాటామంతీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో నిర్వహించిన దీపావళి పూజకు ఆ రాష్ట్ర గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖర్ తన భార్య సుధేశ్ తో కలిసి హాజరయ్యారు. దీపావళి సందర్భంగా మమత నిర్వహించిన ‘బాయ్ దూజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల మమత, గవర్నర్ జగ్ దీప్ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా మమత కాళీ పూజను నిర్వహించి అతిథి సత్కారం చేశారు. ‘ఆమె ఆతిథ్యం అద్భుతం. విందు బాగుంది’ అంటూ గవర్నర్ ప్రశంసించారు. పూజకు హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఆయన పలకరించారు. వీరిద్దరూ గతంలో పరస్పరం విమర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడే ఉన్న మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీతో గవర్నర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తాను 1978 నుంచి ఈ పూజను చేస్తున్నట్లుగా తెలిపారు. అప్పట్లో వాజ్ పేయి, ఎల్. కె అద్వానీలు కూడా హాజరయ్యారన్నారు.