Sujith: చిన్నారి సుజిత్ మృతిపై ఎవరిని కదిలించినా విషాదమే!
- బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్
- నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాటం
- కుళ్లిన స్థితిలో మృతదేహం వెలికితీత
తమిళనాడులో బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ మరణించడం అందరినీ కలచివేస్తోంది. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి చివరికి అత్యంత విషాదకర పరిస్థితుల్లో తుదిశ్వాస విడిచాడు. కాగా, సుజిత్ మరణంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్భ్రాంతికి గురయ్యారు. సుజిత్ ఇక లేడన్న విషయం తెలిసి ఎంతో బాధకు గురయ్యానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, డీఎంకే అధినేత స్టాలిన్ సైతం ఈ విషాద ఘటనపై స్పందించారు.
సుజిత్ మరణం కలచివేసిందని రాహుల్ పేర్కొనగా, ఆ తల్లిదండ్రుల్ని ఎలా ఓదార్చాలంటూ స్టాలిన్ ఆవేదనాభరితులయ్యారు. అదే సమయంలో స్టాలిన్ అధికారపక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యల కంటే మంత్రులకు మీడియా ఇంటర్వ్యూలు ముఖ్యమయ్యాయని ఆరోపించారు. కాగా, కుళ్లిన స్థితిలో సుజిత్ మృతదేహాన్ని వెలికితీయగా, క్రైస్తవ మత సంప్రదాయం అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు.