Botsa Satyanarayana: అగ్రిగోల్డ్ బాధితులను సీఎం జగన్ ఆదుకుంటారు: మంత్రి బొత్స సత్యనారాయణ
- వైఎస్సార్, జగన్ ఇచ్చిన మాట తప్పేవారు కాదు
- సీఎం అగ్రిగోల్డ్ ‘బాధితుల బాసట కమిటీ’ ఏర్పాటు చేశారు
- మ్యానిఫెస్టోలో పెట్టి హామీని నిలబెట్టుకున్నారు
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారని వారిని ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్త శుద్ధితో కృషిచేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు ‘అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ’ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈరోజు బొత్స అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. వైఎస్సార్, జగన్ లు ఆడిన మాట తప్పేవారుకాదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి, ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చారన్నారు. అధికారం చేపట్టాక హామీ ప్రకారం రూ.1150 కోట్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని మంత్రి తెలిపారు. బాధితులకు చెక్కులను స్వయంగా జగనే అందజేయాలంటూ తాను కోరతానని చెప్పారు.
చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్ సంస్థ ఆవిర్భవించిందని, అప్పుడే కుంభకోణం చోటుచేసుకుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ పోరాటం చేస్తూ.. చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకోసం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బొత్స పేర్కొన్నారు.