Jagan: ఏపీ నుంచి ఒక్క ఇసుక లారీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదు: సీఎం జగన్
- పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి పహరా ఉండాలని ఆదేశం
- వరదల కారణంగా ఇసుక తీయలేకపోతున్నామని వెల్లడి
- త్వరలో ఇసుక వారోత్సవం
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇసుక తవ్వకాలు, పంపిణీపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఒక్క ఇసుక లారీ కూడా వెళ్లకూడదని ఆదేశించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల వద్ద గట్టి పహరా వ్యవస్థ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో సుమారు 70 రీచ్ లు గుర్తించాలని తెలిపారు. 267 రీచ్ లు ఉంటే వరదల వల్ల 69 చోట్లకు మించి ఇసుక తీయలేకపోతున్నామని పేర్కొన్నారు.
అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్లకు, ఎస్పీలకు ఎప్పుడో చెప్పానని వెల్లడించారు. ఇసుక తవ్వకాలు, పంపిణీలో అవినీతిని నిర్మూలించామని నేడు గర్వంగా చెప్పగలమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు వస్తున్నాయని తెలిపిన సీఎం జగన్, వరదల కారణంగా ఆశించిన రీతిలో ఇసుకను తీయలేకపోతున్నామని వివరణ ఇచ్చారు.
అయితే, ఇసుక విషయంలో టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మరో వారం రోజుల్లో వరదలు తగ్గుముఖం పడుతాయని భావిస్తున్నామని, రాష్ట్రంలో ఇసుక వారోత్సవం అనే కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. వారం రోజుల పాటు ఇసుక అంశం మీదే పనిచేద్దామంటూ అధికారులకు ఉద్బోధించారు.