CPI ramakrishna: వరదల వల్ల ఇసుక సరఫరా ఆగిందని సీఎం చెప్పడం విడ్డూరం: సీపీఐ నేత రామకృష్ణ
- ప్రభుత్వం దిగజారుడు తనానికి ఇది నిదర్శనం
- ఏ రాష్ట్రంలో లేని వరదలు ఏపీలోనే ఉన్నాయా?
- ముఖ్యమంత్రి తీరువల్లే కూలీలు ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చింది
వరదల వల్లే రాష్ట్రంలో సరిపడ స్థాయిలో ఇసుకను సరఫరా చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఏ రాష్ట్రంలో లేని వరదల సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం దిగజారుడు తనానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ధ్వజమెత్తారు. వాస్తవానికి ప్రభుత్వ పెద్దల అండతో ఇసుకను ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని, అందుకే ఇక్కడ కొరతని ధ్వజమెత్తారు.
ఇసుక కొరత కారణంగా గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పార్టీ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌తో కలిసి ఈ రోజు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్లే రాష్ట్రంలో ఇసుక సమస్య నెలకొందని, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు.
ఇసుక కొరత కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి మృతుల కుటుంబాలకు, పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.