Inter board: ప్రైవేటు జూనియర్ కాలేజీలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా.. రోజుకు లక్ష చొప్పున జరిమానా!
- నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతుల నిర్వహణ
- 50 కాలేజీలను గుర్తించిన ఇంటర్ బోర్డు
- శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే అధికం
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించిన కళాశాలలకు రోజుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. దసరా సెలవుల్లో మొత్తం 50 కాలేజీలు తరగతులు నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. వీటిలో 47 కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే ఉండడం గమనార్హం. ఇప్పటికే ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం నవంబరు 2లోగా జరిమానా చెల్లించాలని, లేదంటే కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.