Vellampalli: విజయవాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు
- రూ. 1.09 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- బాబు పాలనలో విజయవాడ అభివృద్ది ఆఖరి భాగాన నిలిచిందన్న వెల్లంపల్లి
- దొంగ దీక్షకు లోకేశ్ తెరతీశారన్న పేర్ని నాని
గత టీడీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బాబు పాలనలో విజయవాడ అభివృద్ది ఆఖరి భాగాన నిలిచిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఈ రోజు విజయవాడ భవానీపురంలోని 29వ డివిజన్ లో రూ. 1.09 కోట్లతో వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కురసాల కన్నబాబు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరాభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగా దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 29వ డివిజన్ లోని చర్చి రోడ్, సాయిదుర్గా నగర్ కాలనీ, తోట కనకమ్మ రోడ్డులో సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, వరదల వల్ల ఇసుక కొరత వచ్చి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష నేత ఆనందపడుతున్నారని విమర్శించారు. ఐదు గంటల దొంగ దీక్షలకు లోకేష్ బాబు తెర తీశారన్నారు. ఎన్ని అపవాదులు వేసినా వైసీపీ ప్రభుత్వం వెంటే ప్రజలు ఉంటారని చెప్పారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతికి పాల్పడినవారు ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సెంట్రల్ నియోజక వర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఇసుక కొరతను ప్రభుత్వ తప్పిదంగా ప్రజల్లో చూపించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఇసుక వ్యాపారం చేసింది ఎవరనే విషయం బహిరంగ రహస్యమేనని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు బట్టిపాటి సంధ్యారాణి, పుణ్యశీల, అప్పాజీ, పార్టీ నాయకులు మైలవరపు దుర్గారావు, కృష్ణారెడ్డి, జీఎంసీ బాషా, కాలే పుల్లారావు, రియాజ్, డివిజన్ అధ్యక్షులు వెన్నం రజనీ, యరడ్ల ఆంజనేయరెడ్డి, కూరాకుల నాగ, గురుమాంతు మహేష్, రబ్బానీ, పైడి పాటి మురళి తదితరులు పాల్గొన్నారు.