TSRTC: రామాయణంలో ఉడుతలాంటి వాళ్లమే మేం కూడా.. కేసీఆర్ బెదిరించారు: అశ్వత్థామరెడ్డి తీవ్ర ఆరోపణలు
- సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో ఆర్టీసీ సమరభేరి
- పోటెత్తిన జనం
- హాజరైన ప్రతిపక్ష నేతలు
సకల జనుల సమరభేరి సభకు వస్తున్న వారిని అడ్డుకుంటున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ శివారు సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న సకలజనుల సమరభేరికి జనం పోటెత్తారు. ఈ సభకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
స్టేడియం వద్ద సిగ్నల్స్ ఆపేశారని, 3జి, 4జి లైవ్‌లు పనిచేయడం లేదని అన్నారు. టీవీల్లోనూ లైవ్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని గుర్తు చేశారు. రామాయణంలో రాముడికి ఉడుత దారి చూపించకుంటే రామాయణమే లేదని, తాము కూడా ఉడుత లాంటి వాళ్లమేనని పేర్కొన్నారు. కేసీఆర్ తమను బెదిరించారని, భయపెట్టారని పేర్కొన్న అశ్వత్థామరెడ్డి.. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఆపినా అధైర్యపడలేదన్నారు. ఒక్క కార్మికుడు కూడా వెనక్కి తగ్గలేదని అన్నారు.