abu bakr al-baghdadi: బగ్దాదీని ఇలా వెంటాడాం.. ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన అమెరికా!
- మరిన్ని వివరాలను వెల్లడించిన మెంకజీ
- అబు బకర్‌తో పాటు చనిపోయింది ఇద్దరు చిన్నారులే
- దాడిలో మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు హతం
ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని ఎలా వెంటాడిందీ అమెరికా బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఈ వీడియోలో అమెరికా సైనికులు బగ్దాదీ ఇంటిని చుట్టుముడుతుండడం, ఓ జాగిలం పరుగులు పెట్టడం, ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరపడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే, దాడికి ముందు, ఆ తర్వాత బగ్దాదీ ఇంటిని కూడా చూపించారు.
బగ్దాదీ ఇంటిని చుట్టుముట్టిన తర్వాత అతడి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసినట్టు పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. బగ్దాదీ తనకు తాను పేల్చుకున్నప్పుడు అతడితో పాటు చనిపోయింది ముగ్గురు పిల్లలు కాదని, ఇద్దరేనని స్పష్టం చేశారు. వారి వయసు 12 ఏళ్ల లోపేనని తెలిపారు. అదే కాంపౌండ్‌లో ఉన్న మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు హతమైనట్టు తెలిపారు. హెలికాప్టర్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వైమానిక దాడి జరపక తప్పలేదని పేర్కొన్నారు.
బగ్దాదీ ఇంటి నుంచి ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించి పలు ఎలక్ట్రానిక్, డాక్యుమెంట్ రూపంలో ఉన్న ఆధారాలను సేకరించినట్టు మెకంజీ వివరించారు. 2004లో ఇరాక్ జైలులో బగ్దాదీని బంధించినప్పుడు అతడి నుంచి డీఎన్ఏ సేకరించామని, దాని ఆధారంగానే తాజాగా బగ్దాదీ మృతిని ధ్రువీకరించినట్టు తెలిపారు. బగ్దాదీని హతమార్చిన అనంతరం 24 గంటల్లోనే అతడి అవశేషాలను సముద్రంలో కలిపేసి అంతర్జాతీయ నిబంధనలు పాటించినట్టు మెకంజీ వెల్లడించారు. ఇక, బగ్దాదీని తరిమిన శునకం ఇప్పటి వరకు 50 దాడుల్లో పాల్గొందని, తాజా దాడిలో గాయపడినా వెంటనే కోలుకుని విధుల్లో చేరిందని తెలిపారు.