Glenn Maxwell: మానసిక సమస్యలు.. క్రికెట్ కు విరామం ప్రకటించిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్!
- కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న గ్లెన్ మ్యాక్స్ వెల్
- క్రికెట్ కు స్వల్ప విరామం ప్రకటించినట్టు తెలిపిన క్రికెట్ ఆస్ట్రేలియా
- త్వరలోనే కోలుకుని, జట్టులోకి వస్తాడంటూ వ్యాఖ్య
కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. మ్యాక్స్ వెల్ షార్ట్ బ్రేక్ తీసుకున్నట్టు ఈరోజు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం శ్రీలంకతో కొనసాగుతున్న టీ20 సిరీస్ కు మ్యాక్స్ వెల్ స్థానంలో డి'ఆర్సీ జట్టులోకి వచ్చాడు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్ మాట్లాడుతూ, 'మానసికంగా మ్యాక్స్ వెల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగా కొంత కాలం పాటు క్రికెట్ కు అతను దూరమవుతున్నాడు. తనకున్న సమస్య ఏమిటో మ్యాక్స్ వెల్ కు తెలుసు. సపోర్టింగ్ స్టాఫ్ తో కూడా ఆయన అన్ని విషయాలను పంచుకుంటున్నాడు' అని తెలిపారు.
మరోవైపు, శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో మ్యాక్స్ వెల్ 62 పరుగులు చేసి సత్తా చాటాడు. రెండో టీ20లో మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ కు దిగలేదు. శ్రీలంక నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని వార్నర్, స్టీవ్ స్మిత్ ఛేదించారు.
ఈ కష్ట కాలంలో మ్యాక్స్ వెల్ కు, ఆయన కుటుంబానికి ఏకాంతతను కల్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది. త్వరలోనే మ్యాక్స్ వెల్ కోలుకుని, జట్టులోకి వస్తాడనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్యానికి తాము అధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపింది.