MAA president: అమ్మ విజయనిర్మలతో గీతాంజలికి ఎంతో అనుబంధం: మా అధ్యక్షుడు నరేష్
- సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది
- ఎంతో కలుపుగోలుగా ఉండే మనిషి
- అసోసియేషన్ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు
నటిగా ఉన్నత శిఖరాలు అధిరోహించడమేకాక వ్యక్తిగతంగాను ఎంతో ఔన్నత్యం ఉన్న మనిషి గీతాంజలిగారని, ఆమె మరణంతో సినీ పరిశ్రమ ఓ పెద్దదిక్కును కోల్పోయిందని ‘మా’ అధ్యక్షుడు నరేష్ అన్నారు. ఈ సందర్భంగా తన తల్లి విజయనిర్మలతో గీతాంజలికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటి గీతాంజలి ఈరోజు ఉదయం గుండె పోటుతో హైదరాబాద్ అపోలోలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతికి నరేష్‌తోపాటు ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర అసోసియేషన్ సభ్యులు సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తాను ఎప్పూడూ సంతోషంగా ఉంటూ, అందరితో కలుపుగోలుగా వ్యవహరించే మనిషి గీతాంజలి అన్నారు. మా సభ్యులందరి పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారని, అటువంటి మంచి మనసున్న మనిషి మనల్ని వదిలి వెళ్లిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది భాషలతో పాటు హిందీతో కలిపి దాదాపు 500 చిత్రాల్లో గీతాంజలి నటించారు.