Cricket: షెడ్యూల్ ప్రకారమే టీ20 జరుగుతుంది: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
- ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యం
- నవంబరు 3న బంగ్లాతో మ్యాచ్ పై సందేహాలు
- వేదిక మారబోదని స్పష్టం చేసిన గంగూలీ
ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 3న అక్కడ జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చుతారని ప్రచారం జరిగింది. అయితే, ఆ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఈ రోజు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటన చేశారు. 'క్రికెట్ కు ఆతిథ్యమివ్వడం కన్నా కాలుష్యమే ఢిల్లీ వాసులకు పెద్ద సమస్య’ అంటూ ఎంపీ, మాజీ క్రికెటర్ గంభీర్ తాజాగా ట్వీట్ చేయడంతో అక్కడ మ్యాచ్ నిర్వహణపై మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి. కానీ, గంగూలీ ప్రకటనతో ఢిల్లీలోనే మ్యాచ్ ఉంటుందన్నా విషయం స్పష్టమైంది.
కాగా, ఇటీవలే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి పెద్ద జట్లపై భారత్ ఘన విజయాలు సాధించింది. వరుస విజయాలతో ఉత్సాహం మీద ఉన్న టీమిండియాతో బంగ్లాదేశ్ టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఇది పెద్ద సవాలుగా మారింది. భారత్ తో సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ ఆల్రౌండర్, కెప్టెన్ షకిబల్ హసన్ పై ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టుకి మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి.