Jammu And Kashmir: లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా రాధాకృష్ణ మాథుర్ ప్రమాణ స్వీకారం
- మాథుర్ 1977 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి
- త్రిపురకు చీఫ్ సెక్రెటరీగా పనిచేసిన అనుభవం
- జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ సమక్షంలో ప్రమాణ స్వీకారం
కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డ లడక్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా రాధాకృష్ణ మాథుర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. లెహ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఆర్మీ, పారామిలటరీ దళాలు, మత పెద్దలు, ప్రజలు హాజరయ్యారు. అనంతరం మాథుర్ లడక్ పోలీసులచే గౌరవ వందనం అందుకున్నారు. ఈ సందర్భంగా మాథుర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని వేగవంతం చేస్తుందని అన్నారు.
కాగా, 1977 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మాథుర్ త్రిపురకు చీఫ్ సెక్రెటరీగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో 370 అధికరణ రద్దు తర్వాత ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడక్ లుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అక్టోబర్ 31వ తేదీని జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్ డే గా ప్రకటించారు.