Jagan: జగన్ అక్రమాస్తుల కేసు: తప్పుడు బిల్లులు పెట్టారంటూ ఐఏఎస్ లపై కేసు
- జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీవీఎస్కే శర్మ
- తప్పుడు బిల్లులతో చేతివాటం ప్రదర్శించారంటూ పీవీ రమణ అనే వ్యక్తి ఫిర్యాదు
- కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో కొత్త లొల్లి మొదలైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి సీవీఎస్కే శర్మపై హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నుంచి న్యాయ సహాయం పొందిన ఆయన... తప్పుడు బిల్లులతో చేతివాటం ప్రదర్శించారంటూ పీవీ రమణ అనే వ్యక్తి హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో శర్మకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పీవీ రమేశ్ సహకరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఏడుగురు ఐఏఎస్ లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరందరికీ న్యాయ సహాయం కోసం అప్పటి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయితే తప్పుడు బిల్లులు పెట్టి సీవీఎస్కే శర్మ లక్షల రూపాయలను కాజేశారని పీవీ రమణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడున్నర లక్షల రూపాయల వరకు లీగల్ ఛార్జీలను పొందారని తెలిపారు. బిల్స్ ను సరిగా పరిశీలించకుండానే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి బిల్లులపై సంతకాలు చేశారని చెప్పారు. అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ నిధులను విడుదల చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని పీవీ రమణ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.