Vellampalli: ముఖ్యమంత్రికి వైశ్య సమాజం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
- పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితమే తెలుగు రాష్ట్రం ఏర్పాటన్న మంత్రి
- సీఎం జగన్ పై ప్రశంసలు
- రాష్ట్ర అవతరణ దినోత్సవానికి హామీ ఇచ్చారని వెల్లడి
నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశంసలతో ముంచెత్తారు. ‘తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రంకోసం ప్రాణాన్నే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములను జ్ఞాపకం చేసుకుంటూ నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్న సీఎం జగన్ కు నా తరపున, వైశ్య సమాజం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న అమరులయ్యారని తెలిపారు. ఆయన ఆత్మార్పణ తర్వాత 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, 1956 నవంబర్ 1న భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందన్నారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏటా జరుపుతామని జగన్మోహన్ రెడ్డి గతంలో మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆరేళ్ళ తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను మన చరిత్రకు, మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.