Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అంగన్ వాడీ చిన్నారులకు ఆహారంగా గుడ్లు... గుడ్లు తినేవాళ్లు రాక్షసులన్న బీజేపీ నేత!
- మధ్యప్రదేశ్ లో అంగన్ వాడీల్లో గుడ్లు తప్పనిసరి చేసిన సర్కారు
- ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న విపక్షనేత గోపాల్ భార్గవ
- భారతీయ సంస్కృతి ప్రకారం మాంసాహారం నిషేధం అన్న నేత
మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఇటీవలే రాష్ట్రంలోని అంగన్ వాడీల్లో చిన్నారులకు గుడ్లు ఆహారంగా అందించాలని ఆదేశాలు జారీచేశారు. అంగన్ వాడీ చిన్నారులకు ప్రతి రోజూ ఒక గుడ్డును మెనూలో చేర్చాలని ఆయన స్పష్టం చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత గోపాల్ భార్గవ ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించారు. గుడ్లు తినేవాళ్లు రాక్షసులు అంటూ ఈ బీజేపీ నాయకుడు దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు.
భారతీయ సనాతన సంస్కృతి ప్రకారం మాంసాహారం తీసుకోరాదని, తమ సామాజిక వర్గ నియమాల్లో భాగంగా తాను ఉల్లి, వెల్లుల్లి కూడా తీసుకోనని భార్గవ స్పష్టం చేశారు. చిన్నారులను గుడ్లు, మాంసం తినాలని ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదని అన్నారు. బీజేపీకి చెందిన మరో నేత కైలాష్ విజయవర్గియా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వం అంగన్ వాడీ ఆహారంలో గుడ్లను చేర్చడం మత విశ్వాసాలకు విఘాతం కలిగించడమేనని తెలిపారు.