Hyderabad: 11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారయత్నం.. కటకటాల్లోకి నిందితుడు
- హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో ఘటన
- ప్రిన్సిపాల్ చేష్టలను తల్లిదండ్రులకు చెప్పిన బాలిక
- ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్న డిప్యూటీ ఈవో
మూడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్, బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. ఇంతిజార్ అలీ అనే వ్యక్తి మోషియన్ పేరుతో కిషన్‌బాగ్ అసద్‌బాబానగర్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా మూడో తరగతి చదువుతున్న బాలిక తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోయారు. దీంతో ఉపాధ్యాయులు పరీక్షకు అనుమతించలేదు. విషయం తెలిసిన తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి పరీక్షకు అనుమతించాలని, త్వరలోనే ఫీజు చెల్లిస్తామని కోరారు. దీనికి సరేనన్న ప్రిన్సిపాల్ ఇంతిజార్ ఆధార్, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్షకు అనుమతిస్తానని చెప్పాడు.
ప్రిన్సిపాల్ అడిగిన పత్రాలు తీసుకుని విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలుకొచ్చారు. అయితే, కంప్యూటర్ పనిచేయడం లేదని చెప్పిన అలీ.. వారిని ఇంటికి పంపేసి విద్యార్థినిని స్కూల్లోనే ఉండమన్నాడు. సాయంత్రం బాలికను పిలిచి ఆధార్ కార్డును పరిశీలిస్తున్నట్టు నటిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఇంటికెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఇంతిజార్ అలీని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈవో వేణుగోపాలాచారి తెలిపారు.