Guntur District: గుంటూరు జిల్లాలో మరో కీర్తి...ఆస్తి కోసం భర్త, చినమామతో కలిసి తల్లి హత్య!

  • అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే యత్నం
  • మృతురాలి బంధువుకు అనుమానం రావడంతో గుట్టు రట్టు
  • నగరంపాలెంలో దారుణం

ఆస్తికోసం స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌కు చెందిన కీర్తి కథ ఇంకా మర్చిపోకముందే గుంటూరులో అటువంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఆస్తిని తల్లి తన ప్రియుడికి ఎక్కడ రాసిస్తుందో అన్న అనుమానంతో  భర్త, చినమామతో కలిసి కన్నకూతురే  ఆమెను హత్యచేసింది. అనంతరం తల్లి అనారోగ్యంతో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసినా మృతురాలి బంధువు అనుమానం మేరకు పోలీసులు కూపీలాగడంతో గుట్టు రట్టయింది. గుంటూరు జిల్లా నగరంపాలెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన ఆలపాటి లక్ష్మి (45), రమేష్‌ దంపతులకు కొడుకు హేమంత్‌, కూతురు భార్గవి వున్నారు. వీరి కుటుంబానికి తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి వద్ద ఒకటిన్నర సెంట్లు స్థలం, అమరావతి పరిధి తమ్మవరంలో 17 సెంట్ల పొలం ఉంది. 2007లో భార్గవికి అచ్చంపేట మండలం పుట్టగూడెంకు చెందిన మన్నం రామాంజనేయులతో పెళ్లయింది. ఆ తర్వాత భార్గవి తమ్ముడు హేమంత్‌, తండ్రి రమేష్‌ చనిపోయారు.

కూరగాయల వ్యాపారం చేసే లక్ష్మికి కిషోర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తల్లి తన పేరున ఉన్న ఆస్తి ఆమె ప్రియుడు కిషోర్‌కు రాసిస్తుందేమోనని భార్గవికి అనుమానం మొదలై ఆమెను హత్య చేయాలనుకుంది. ఇందుకోసం భర్త రామాంజనేయులు, అతని బాబాయ్‌ వెంకటశివరామ్‌ సాయంతో పథక రచన చేసింది. ఈనెల 10వ తేదీన ముగ్గురూ లక్ష్మి ఇంటికి వెళ్లారు. అప్పటికి మద్యం మత్తులో ఉన్న లక్ష్మిని గొంతు నులిమి చంపేశారు.

అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసు, బీరువాలో ఉన్న 39 వేల నగదు, సెల్‌ఫోన్‌ తీసుకుని ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. సెల్‌ఫోన్‌ను మధ్యలో పడేసి, బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టేశారు. ఇదిలావుండగా, ఈనెల 11వ తేదీన లక్ష్మి వద్ద పనిచేసే మహిళ ఆమె ఇంటికి వచ్చింది. లక్ష్మి అచేతనంగా పడివుండడాన్ని చూసి విషయం కూతురు భార్గవికి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది.

ఆమె ఏమీ తెలియనట్టు వచ్చి తన తల్లి అనారోగ్యంతో చనిపోయి ఉంటుందని అంటూ అంత్యక్రియల ఏర్పాట్లు చూసింది. అయితే అనారోగ్యంతో చనిపోతే ఆమె మెడలోని బంగారం, సెల్‌ఫోన్‌ ఏమయ్యాయని  లక్ష్మి బావ గోవింద్‌కు అనుమానం వచ్చింది. దీంతో అతను అంత్యక్రియలకు ఒప్పుకోలేదు. ఇరు వర్గాల మధ్య ఇది వివాదానికి దారితీసి విషయం పోలీసుల వరకు వెళ్లింది.

పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపడంతో ఆమెను గొంతునులిమి చంపినట్టు తేలింది. దీంతో లక్ష్మి కూతురు, అల్లుడితోపాటు వారి బంధువును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించారు. దీంతో ముగ్గురినీ అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News