Telangana: తెలంగాణలో రెండు దశల్లో మున్సిపల్ ఎన్నికలు?
- సోమవారం షెడ్యూల్ విడుదల?
- కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు తొలిదశలో ఎన్నికలు
- విచారణలో ఉన్న వాటికి రెండో దశలో ఎన్నికలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. సోమవారం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నట్టు సమాచారం.
కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు తొలిదశలో, కోర్టు విచారణలో ఉన్న వాటికి రెండో దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది. తొలిదశ మున్సిపాలిటీల రిజర్వేషన్ల కసరత్తును సర్కారు ఇప్పటికే పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఆయా వార్డుల రిజర్వేషన్ల డ్రా నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంచితే, ఈ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల వ్యాజ్యాలు దాఖలు కాగా, వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసిన విషయం తెలిసిందే. మొదట ఈ ఎన్నికలను ఆగస్టు 15లోపే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో కొందరు పిటిషన్లు దాఖలు చేయడంతో నిర్వహణ వాయిదా పడుతూ వచ్చింది.