Kanna: చట్టం ముందు అందరూ సమానమే అనే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైంది: కన్నా లక్ష్మీనారాయణ
- వ్యక్తిగత హోదాలోనే జగన్ పై కేసు నమోదైంది
- జగన్ 5 నెలల పాలనలో ప్రజలు భయపడుతూ బతికారు
- ఇసుక కొరతను ప్రభుత్వమే కృత్రిమంగా సృష్టించింది
వ్యక్తిగత హోదాలోనే ముఖ్యమంత్రి జగన్ పై అక్రమాస్తుల కేసు నమోదైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ ను ఈరోజు సీబీఐ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కన్నా మాట్లాడుతూ, చట్టం ముందు అందరూ సమానమేననే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైందని చెప్పారు. జగన్ 5 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు భయపడుతూనే బతికారని... ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా ఉండాలా అని భయపడుతున్నారని అన్నారు. అందుకే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని మా పార్టీ వాళ్లకు కూడా చెప్పామని తెలిపారు.
ఇసుక కొరతను ప్రభుత్వమే కృత్రిమంగా సృష్టించిందని కన్నా ఆరోపించారు. లక్షలాది భవన నిర్మాణ కార్మికుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు ఇది పెద్ద సమస్యగా కనిపిస్తున్నా... రాష్ట్ర మంత్రులకు మాత్రం కనిపించడం లేదని అన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్నవారిపై దాడులు చేయడం సరైంది కాదని చెప్పారు. జనసేన చేపడుతున్న లాంగ్ మార్చ్ కు తమ సంఘీభావం ఉంటుందని... కానీ, అందులో పాల్గొనడం మాత్రం ఉండదని తెలిపారు. ఈ నెల 4న ఇసుక సత్యాగ్రహాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు.