GHMC: జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులను బకాయిలుగా పరిగణించొద్దు: కోర్టును కోరిన తెలంగాణ ఆర్టీసీ
- ఆర్టీసీ సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్టు
- తప్పుడు లెక్కలు ఇచ్చారని ధర్మాసనం ఆగ్రహం
- తదుపరి విచారణ ఈనెల 7కు వాయిదా
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈరోజు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడు రమేష్, సంస్థ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలు సమర్పించారని ఆక్షేపించింది. పూర్తి వివరాలతో మళ్లీ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
బస్సుల కొనుగోలుకైన వ్యయాన్ని బకాయిలుగా చెపుతారా అని ప్రశ్నిస్తూ.. అసలు జీహెచ్ఎంసీ, ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలా? లేదా? అన్న విషయం స్పష్టం చేయాలని కోరింది. గతంలో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవచ్చు, ప్రస్తుతం దాని పరిస్థితి బాగానే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
2015 నుంచి 2017 మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఆర్టీసీకి భారీ మొత్తంలో బకాయిపడ్డప్పటికీ, కేవలం రూ.336 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆర్టీసీ తన నివేదికలో తెలిపింది. నిబంధన 112(30) సెక్షన్ ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ అఫిడవిట్లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు కాగా ఆ మొత్తాన్ని చెల్లించినట్లు పేర్కొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్ నగరంలో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు విడుదల చేసినట్లు చెప్పింది. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిధులను బకాయిలుగా పరిగణించరాదని ఆర్టీసీ కోర్టును అభ్యర్థించింది. నిర్వహణ, డీజిల్ వ్యయం కారణంగా సంస్థ నష్టాలు ఎదుర్కొంటుందని అఫిడవిట్లో పేర్కొంది. కార్మికుల సమ్మె ప్రారంభమైన అక్టోబర్ 5 నుంచి 30వ తేదీ వరకు బస్సుల ద్వారా రూ.78 కోట్లు ఆర్జించగా, మరోవైపు రూ.160 కోట్లు నిర్వహణ వ్యయం నమోదైందని తెలిపింది. కాగా, హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.